టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేసారు. అంతకుముందు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామయ్య బాలకృష్ణ దగ్గరుండి కారెక్కించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పాదయాత్రకు ఇంటినుండి బయలుదేరిన అనంతరం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ను మొదటి అయిదేళ్లలో టీడీపీ గాడిలో పెట్టిందన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన కృషి అందరికీ తెలుసన్నారు. ఆ తర్వాత ఒక్కచాన్స్ అంటూ కాళ్లావేళ్లా ప్రాధేయపడి, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసాన్ని కూడా మీరంతా చూస్తున్నారని చెప్పారు. వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కాని వారు ఎవరు లేరన్నారు.
కర్షకులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు …ఇలా ప్రతివర్గం మాకొద్దీ అరాచకపాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికంగా పౌరులకు ఇచ్చిన ప్రశ్నించే హక్కుని వైసీపీ హరించిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నియంత కంటే ఘోరంగా రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. లోకేష్ మొదట కడప వెళ్లి, అక్కడ దర్గాలో ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుండి తిరుమల వెళ్లి శ్రీవారి దైవదర్శనం చేసుకుని, కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభిస్తారు.