టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేష్ నాయుడు భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా యాత్రకు బయల్దేరారు. కాగా.. 400 రోజుల పర్యటనలో లోకేష్ ప్రజలతో మమేకం కానున్నారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బయలుదేరే ముందు టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ సమాధిని దర్శించుకోనున్నారు. ఎన్టీయార్ కు నివాళులర్పించనున్నారు. ఆ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ బయలుదేరనున్నారు.
పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేష్ కోసం ప్రత్యేక కార్వాన్ సిద్ధమయింది. పాదయాత్రలో విశ్రాంతి తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్ లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి కార్వాన్ ద్వారా కుప్పం బయలు దేరనున్నారు. లోకేశ్ తో పాటు పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా కుప్పం బయలుదేరనున్నారు.