Kotamreddy: సజ్జల సాయానికి థ్యాంక్స్, 6 నెలల్లో చిత్రాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని, తనకు మేలు జరిగేలా ఆయన మాట్లాడించారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల తర్వాత ఏపీలో మరిన్ని చాలా చిత్రాలు, విచిత్రాలు చూస్తారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో తన స్నేహితుడు రామశివారెడ్డి (Ramashiva Reddy) చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) గురువారం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఆయన చదివారని ఆరోపించారు. ఆయన కార్పోరేటర్లతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తాను అత్యంత కష్టాల్లో ఉన్న ఈ సమయంలో మేయర్‌తో సహా 11 మంది కార్పోరేటర్లు తన వెంట వచ్చారని, ఇందుకు వారికి థ్యాంక్స్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను చెప్పినట్లుగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు (amit shah) రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, దొంగచాటుగా తన మాటలు విన్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని మీరు మనస్ఫూర్తిగా నమ్మి.. రాష్ట్ర ప్రభుత్వమే హోంశాఖకు లేఖ రాసి ఉండేదన్నారు. నేను ఈ వ్యవహారంలో విచారణ కోరుతుంటే.. తాను ఎవరితో మాట్లాడారో.. ఆ వ్యక్తిని తీసుకు వచ్చారని, ఆ వ్యక్తి చెప్పినంత మాత్రాన నిజమవుతుందా అని ప్రశ్నించారు. మీరు కేంద్ర హోంశాఖకు లేఖ రాసేందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పత్రికాధిపతులు, చివరకు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని, ఒకరితో మరొకరు మామూలు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి నిజాయితీని నిరూపించుకోవాల్సిందన్నారు. అలా లేఖ రాస్తే.. తనతో పాటు ఫోన్ ట్యాపింగ్ చేసిన అందరి వివరాలు బయటపడతాయనే భయం ఉన్నట్లుగా ఉందన్నారు.
ఇది సవాల్ కాదు..
ఫోన్ ట్యాపింగ్ పైన తాను సవాల్ చేయడం లేదని, కేవలం అభ్యర్థన మాత్రమే అన్నారు. తాను ఫిర్యాదు చేసినట్లు జగన్ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేయాలని, అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. ఇక తన మిత్రుడు రామశివారెడ్డి చాలా విచిత్రంగా మాట్లాడారన్నారు. అయిదు నెలలుగా అన్ని రికార్డులు ఉన్నాయని చెప్పారని, తనది ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పారని, కానీ తన ఫోన్ రికార్డింగ్ మాత్రం 4వ తేదీన ఎందుకు డిలీట్ చేశారో తెలియడం లేదన్నారు. రామశివారెడ్డికి స్క్రిప్ట్ సరిగ్గా ఇచ్చినట్లుగా లేదన్నారు. ఆ స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల ఇచ్చారని, ఆయన కలత చెందిన మనసుతో రాసిచ్చి ఉంటారన్నారు. అయిదు నెలలుగా రికార్డులు ఉండటం ఏమిటి… 4వ తేదీన డిలీట్ చేయడం ఏమిటో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ పైన ఎవరికైనా అనుమానం ఉంటే తన స్నేహితుడి వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పరోక్షంగా చెప్పడానికి తన స్నేహితుడికి స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జలకు తాను థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. సజ్జల గారూ… మీరు ఇచ్చిన స్క్రిప్ట్ నాకు మేలు చేసింది.. అన్నారు. గతంలో తనపై ఉన్న అభిమానమో, వైసీపీలో కొనసాగిన సమయంలో తనకు ఏం చేయనందుకో.. ఏదైతేనేం.. తన రుణం మీరు ఇలా తీర్చుకొని ఉంటారన్నారు.
Kotamreddy
కేంద్రం రంగంలోకి దిగితే…
కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగితే తన ఫోన్ మాత్రమే కాదని… ఎవరెవరి ఫోన్ ట్యాప్ జరిగిందో.. అన్నీ తెలుస్తాయని చెప్పారు. లేఖ రాయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని పదేపదే ప్రశ్నించారు. శ్రీధర్ రెడ్డి జీవితకాలం ధర్నా చేసుకోవాల్సిందేనని ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటున్నారని, కానీ ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే.. నేను వచ్చిందే ధర్నాల నుండి అన్నారు. తాను అలమట్టి ఇంజీనీర్ల వద్ద నుండి, మహారాష్ట్ర ఇంజినీర్ల నుండి కాదని ఎద్దేవా చేశారు. ధర్నాలు, నిరసనలు, గాంధీగిరి తనకు కొత్త కాదన్నారు. ప్రజల పక్షాణ ఎప్పటికీ నిలుస్తూనే ఉంటానన్నారు. కాంట్రాక్టర్‌గా, ఎంపీగా తనకు తెలుసునని, కానీ ఆయన కొత్త అవతారం జాతకాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నారో తనకు తెలియదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ రూరల్ అభ్యర్థిగా వాడవాడలా తిరిగిన ఆదాల… జగన్‌ను, నన్ను ఇష్టారీతిన తిట్టి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన మీరు నా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నీ వద్ద వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు.. కానీ నాకు ప్రజాభిమానం ఉందని చెప్పారు. గతంలో టీడీపీ బీఫారమ్ జేబులో పెట్టుకొని, వైసీపీలో చేరిన మీరు.. 2024లో అలా చేయనని, వైసీపీ నుండే పోటీ చేస్తానని మీరు చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పగలరా అన్నారు. మీరు అలా చెబితే నేను మరోమారు మీ గురించి మాట్లాడేది లేదన్నారు. లేదా నేను వైసీపీని వద్దనుకున్నానని, ఆ పార్టీకి దూరం జరుగుతున్నానని కూడా స్పష్టంగా చెప్పవచ్చునన్నారు. మరో ఆరు నెలల తర్వాత మరిన్ని చాలా చిత్రాలు, విచిత్రాలు చూస్తారన్నారు.