తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అని, అక్కడకు తాను షిఫ్ట్ అవుతున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మూడు రాజధానులపై స్పందిస్తున్నారు. జగన్ ఢిల్లీలో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఎప్పుడూ చెప్పేదే చెప్పారన్నారు. సుప్రీం కోర్టు కూడా తమకు రాజధానిపై శాసనాధికారం లేదంటే, కేంద్రం ప్రభుత్వంతో బిల్లు పెట్టిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ మద్దతు కావాల్సిన పార్టీలు మూడు రాజధానులకు అంగీకారం తెలపాల్సిందే అన్నారు. రాజధాని విషయంలో తాము ముందు చెప్పిన మూడింటికే కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో విశాఖ నుండి పరిపాలన ప్రారంభమవుతుందన్నారు.
అదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డ్రామా అని, పార్టీ నుండి బయటకి వెళ్లేందుకు ఒక నాటకం అని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే పదవి కోసం పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కోటంరెడ్డి లాంటి వాడు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్కు ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. వైసీపీకి కూడా ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పారు. కోటంరెడ్డి పోతే రేపు పొద్దున్నే కొత్త ఇంచార్జీని నియమిస్తామని చెప్పారు. మేం ఫోన్ ట్యాపింగ్ ప్రోడక్ట్స్ కొనలేదని చంద్రబాబే చెప్పారని, అలాంటప్పుడు ఎలా ట్యాప్ చేస్తామని ప్రశ్నించారు. పార్టీ నుండి వెళ్లిపోవాలి అనుకుంటే, ఏదో ఒక కారణం చెప్పాలని, అందుకే ట్యాపింగ్ అంటున్నాడన్నారు.