నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్నవాళ్లకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తే గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి 25వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్‌లో ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని తాను చెప్పలేదన్నారు. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో టీడీపీలోకి చేరికలు ఉంటాయన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాజకీయంగా చైతన్యం కలిగినవారన్నారు.
2019 ఎన్నికలలో ఎమ్మెల్యే స్థానాన్ని టీడీపీ ఓడిపోయినప్పటికీ, ఎంపీగా తనకు 15 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం కోసం అందరూ కలిసి పని చేస్తున్నారన్నారు. ఎందరు నాయకులు ఉన్నా పార్టీ కార్యాలయం పెట్టలేకపోయారన్నారు. జైన్ అనే వ్యక్తి ఇటీవల ముందుకు వచ్చి పార్టీ కార్యాలయం కట్టించారని కితాబిచ్చారు. నాయకులుగా చలామణి అవడం కాదని, పార్టీ కోసం పని చేయాలని సూచించారు. టీడీపీకి పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందరూ కలిసి ఇదే విధంగా బాగా పని చేయాలన్నారు.
ఇదిలా ఉండగా, మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు సైకిల్ ఎక్కనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. కాండ్రు టీడీపీలో చేరుతున్న కారణంగా మంగళగిరిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే, వీటిని అధికారులు తొలగించారు. కాండ్రు వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉన్నారు. కానీ తగిన గుర్తింపు లేదని, సముచిత స్థానం లభించడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారుతున్నారు.