త్వరలో విశాఖపట్నం భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించి ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సు వివరాలను వెల్లడించారు. 49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలని స్థానిక పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు వెల్లడించారు. వారిలో నమ్మకం పెరిగి, కొత్త పెట్టుబడులతో ముందుకు వస్తున్నారని, అలాగే ఉన్నవాటిని విస్తరించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఏపీలో పరిశ్రమల కోసం 49వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్న జీ-20 సన్నాహక సదస్సులు విశాఖ భవిష్యత్తును మార్చనున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ నేరుగా విశాఖ తరలి వస్తున్నారని, పరిపాలన రాజధానిపై అనుమానాలు తీరిపోతాయన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కాదని, సన్నిహితులే రికార్డింగ్ చేసి బయట పెట్టారన్నారు. పార్టీలో ఉండటం ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చునని, కానీ ఆరోపణలు సరికాదన్నారు. తనకు 600 ఎకరాల వెంచర్ ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారని, ఆయన వస్తే కనుక ఆ భూములు ఆయనకే రాసిస్తా అన్నారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే నాయకుడిగానే తాను జనసేనాని చూస్తానన్నారు.