»Flower In The Ear Slogans Saying We Dont Want You
CPS Employees: చెవిలో పువ్వు.. మాకొద్దు నువ్వు అంటూ నినాదాలు
అనకాపల్లిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగం సంఘ అధ్వర్యంలో నిన్న జరిగిన ఆత్మ గౌరవసభలో.. సీపీఎస్ ఉద్యోగులు జగన్ నువ్వు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. జగన్ ఇచ్చిన హామీ మరిచారని మరోసారి పలు రకాలుగా ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
CPS Employees: అనకాపల్లిలో నిన్న రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగం సంఘ అధ్వర్యంలో ఆత్మ గౌరవసభ నిర్వహించారు. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి భారీగా సీపీఎస్ ఉద్యోగులు తరలివచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఉద్యోగులు పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు తర్వాత జరిగే ఎన్నికల్లో ఓటు అడగడానికి అర్హులు కారని.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు జగన్ చెప్పారని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. గెలిచిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ పథకం అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ జగన్ గెలిచి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా ఇచ్చిన హామీని అమలు చేయలేదని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటు అడిగే హక్కు కూడా తనకు లేదని కూడా సీపీఎస్ ఉద్యోగులు ఎద్దేవా చేశారు.
గతంలో జగన్‌ను గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని సీపీఎస్ ఉద్యోగులు అన్నారు. ప్రతి ఉద్యోగి జగన్‌ను ప్రతిపక్ష నేతగా చూసేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో చెవిలో పువ్వు..మాకొద్దు నువ్వు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, విజయనగరం జిల్లా కోశాధికారి ఎస్. అప్పలనాయుడు, అనకాపల్లి మండల గౌరవ అధ్యక్షుడు బి. శ్రీనివాస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుండు గీయించుకున్నారు. మరోవైపు జిల్లా ప్రధాన కార్యదర్శి మోటారు త్రినాథస్వామి మెడలో చెప్పుల దండ వేసుకుని చెప్పులతో కొట్టుకున్నారు. మరికొంత మంది కంచాలు పట్టుకుని భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు.