»Excursion In Godavari River Dead Bodies Of Four Youths Found
Tragedy: గోదావరి నదిలో విహారయాత్ర..నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం
గోదావరి నది వద్దకు విహార యాత్రకు వచ్చి నలుగురు యువకులు మృతిచెందారు. నదిలో స్నానం చేయడానికి దిగి ఓ వ్యక్తి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అతడిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు స్నేహితులు కూడా నదిలో గల్లంతయ్యారు. పోలీసులు ఆదివారం వారి మృతదేహాలను వెలికితీశారు.
గోదావరి నది (Godavari River)లో విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నదిలో స్నానానికి దిగి గల్లంతైన నలుగురి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, గోపులంక వద్ద చోటుచేసుకుంది. శనివారం నలుగురు యువకులు స్నానం కోసం గోదావరిలోకి దిగారు. నదిలో వారు గల్లంతవ్వడంతో వారి జాడ కోసం పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో ఆదివారం వారి మృతదేహాలను వెలికితీశారు.
మృతిచెందిన వారంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు మూడు బైకులపై శనివారం గోపులంక పుష్కరఘాట్‌కు విహార యాత్రకు విచ్చేశారు. వారిలో హనుమకొండ కార్తిక్ ముందుగా స్నానానికి దిగాడు. అతను నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించి ముగ్గురు నదిలోకి వెళ్లారు.
మద్దెన ఫణీంద్ర గణేష్, పెండ్యాల బాలాజీ, తిరుమలరావు రవితేజలు గోదావరిలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో మిగిలిన స్నేహితులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. నలుగురు ఫ్రెండ్స్ చనిపోవడంతో విషాదం నెలకొంది.