మరో రెండు రోజుల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ పండగను వేడుకలా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ పండగ వేడుకల్లో పాలుపంచుకుంటూ ఉంటాయి. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం.. ఈ వినాయక చవితి ఏర్పాట్లలోనూ వివాదం క్రియేట్ చేస్తుండటం గమనార్హం. వినాయక చవితి పందిళ్లను కూడా వివాదం చేసేశారు. గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల కారణంగా వినాయక చవితి వేడుకలు పెద్దగా జరగలేదు. ఈ ఏడాది చవితి పందిళ్ల విషయంలో మాత్రం మొదట్నుంచి అన్ని ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ శాఖలు అతిగా స్పందించాయనే విమర్శలున్నాయి. గతంలో సింగల్ విండో అనుమతు ఇస్తే ఈ సారి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకోవాలంటూ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు.
బీజేపీ మొదట్లోనే ఈ వ్యవహారాన్ని తప్పు పట్టింది. దాదాపు పక్షం రోజులుగా చవితి పందిళ్ల విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని ఆ పార్టీ తప్పు పడుతూ వచ్చింది. అయితే ఒక్కసారి కూడా ప్రభుత్వం నుంచి కానీ, పోలీసుల నుంచి, ఇతర శాఖల నుంచి కానీ స్పందన రాలేదు. చివరకు పండక్కి నాలుగు రోజుల ముందు బీజేపీ ఆందోళనలకు పిలుపునివ్వగానే అంతా నాలుక కరుచుకున్నారు.
ఇదిలా ఉండగా… వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాకపోయినా .. ప్రభుత్వం పండుగలు జరుపుకోకుండా ఇబ్బందులు పెడుతోందని, ఆంక్షలు విధిస్తుందంటూ పదేపదే విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కంటే తాము అధికారంలోకి వచ్చాకే వినాయక మండపాలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించినా టీడీపీ- బీజేపీలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుసుముల విషయంలో మా ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదని, 2014లో చంద్రబాబు తీసుకువచ్చిన జీవో ప్రకారమే మండపాల వద్ద డీజేలు వాడవద్దని టీడీపీ-బీజేపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేస్తున్నామని చెబుతోంది. వినాయక చవితి పండుగను ఉపయోగించుకుని ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్న సోము వీర్రాజు, చంద్రబాబు నాయుడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని , వారిపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పోలీస్లకు విజ్ఞప్తి చేశారు. హిందూ పండుగులను రాజకీయం చేస్తూ, ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నవీరు అసలు హిందువులు, భారతీయులే కాదని ఆరోపించారు.