ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత , ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా.. అయ్యన్నపాత్రుడి అరెస్టు పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలు దూకి తలుపులు బద్దలుగొట్టి మాజీ మంత్రి బీసీ నేత అయిన అయ్యన్న ను ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.