నంద్యాల జిల్లా (Nandyala District) లోని టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ (Bhuma akhilapriya), ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వివాద ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. .ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల ఘటనపై సీనియర్లతో త్రిసభ్య కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైసీపీ శ్రేణులు టీడీపీ (TDP) కార్యక్రమాల్లోకి చొరబడి ఘర్షణలకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy) వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. యువగళం (Yuvagaḷam) పాదయాత్రకు స్వాగత ఏర్పాట్ల సమయంలో జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ వర్గానికి చెందిన వారు కొట్టారు. వెంటనే కలుగజేసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఈ ఘటన అనంతరం బుధవారం ఉదయం అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు.