రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళిక-శిక్షణ కార్యక్రమం బుధవారం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేశాయట. సాధారణంగా ఓ పార్టీ నాయకుడిపై మరో పార్టీ నేత విమర్శలు సహజమే. కానీ చంద్రబాబు అంటే ఎంతో మక్కువ, రాజకీయ గురువుగా భావిస్తారు. ఇప్పుడు అలా మాట్లాడటం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోవడం లేదట. టీడీపీ దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలంగాణలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఆ పార్టీకి మంచి కేడర్ ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ కేడర్‌ను ముఖ్యంగా తెలంగాణ తమ్ముళ్లను రేవంత్ వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తికి గురి చేశాయట.
స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత టీడీపీలో చేరి సుదీర్ఘ కాలం చంద్రబాబుతో కలిసి పని చేశారు. 2017 చివరలో కాంగ్రెస్‌లో చేరారు. అయన కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు వెనుక రేవంత్-చంద్రబాబులకు ఉన్న సాన్నిహిత్యమే ప్రధాన కారణమనే వాదనలు ఉన్నాయి. అలాంటి చంద్రబాబుపై ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ ద్వారా ఆయన రాటుదేలారు. ఆ తర్వాత స్వతంత్రంగా పోటీ చేసినా, పార్టీలలో ఉన్నా.. ఆ దూకుడు అంతా ఏబీవీపీ నుండి అబ్బిందని చెబుతారు.
రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఎవరైతే ఉపయోగపడ్డారో.. ఇప్పుడు వారిపట్లనే అనుచితంగా మాట్లాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజం. కానీ రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా తనకు పాఠం నేర్పిన సంస్థ రాజకీయాలు నేర్పిన గురువు పట్ల వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గతంలో ఓసారి భరతమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీ ఇందుకు భిన్నం. ఈ సంస్థ నిత్యం భారత్ మాతాకీ జై అని నినదిస్తుంది. ఇప్పుడు చంద్రబాబుపై ఘాటుగానే విమర్శలు చేశారు. చంద్రబాబుపై అలాంటి వ్యాఖ్యలు రేవంత్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరని అంటున్నారు. గతంలో సోనియా పైన కూడా తీవ్రపదజాలం ఉపయోగించారు. కానీ అప్పటికి కాంగ్రెస్‌లో చేరలేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మాట్లాడారని చెప్పవచ్చు. ఇప్పుడు మాత్రం అన్నం పెట్టిన సంస్థ, గురువునే అలా మాట్లాడటం వెనుక రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కాలనే ఆలోచన తప్ప, తనకు మార్గం చూపారనే ఆలోచన కూడా లేకపోడం విడ్డూరమంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రేవంత్ నాడు చంద్రబాబును ఎవరూ కాపాడలేదని, ఇప్పుడు కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరని చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా తన గురువుపై విమర్శలు గుప్పించారు. 2003-04లో చంద్రబాబు ప్రపంచానికి రాజు అవుతాడనేంత మీడియాలో అభూత కల్పన, ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారని, వారి చేతిలో (చంద్రబాబు) అప్పుడు మీడియా, పేపర్ ఉంది అని అలా చేశారని, కాంగ్రెస్ అసలు పోటీలో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేశారని, కానీ ప్రజల్లో అసహనం వస్తే, ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతే ఎలా ఉంటుందో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే నిదర్శనం అన్నారు. అప్పుడు చంద్రబాబును ఏ పేపర్, మీడియా కాపాడలేదన్నారు. అప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదని అపోహలు సృష్టించారని, ఇప్పుడు 2023లోను అదే జరుగుతోందన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు తేడా లేదని, అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు అంతే తేడా అన్నారు. నాడు, నేడు పేదల కోసం కొట్లాడుతోంది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. మొత్తానికి రేవంత్… చంద్రబాబును టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
2003-04లో చంద్రబాబుపై కాంగ్రెస్ పొరాడిందని ఇప్పుడు చెబుతున్న రేవంత్, నాడు అదే పార్టీలో ఎందుకు చేరలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. విమర్శలు సహజమేనని, కానీ రాజకీయాల్లో ఎదగడం కోసం దిగజారి మాట్లాడవద్దనే వారు లేకపోలేదు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా తనకు చంద్రబాబు అంటే ఇష్టమని పలుమార్లు చెప్పారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబును కార్నర్ చేశారు.
ఇక్కడ మరో అంశం కూడా ఉందని అంటున్నారు. తెలుగుదేశం తెలంగాణలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆయన తన గురువు వద్దకు వెళ్తారా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు వద్ద ప్రస్తుత కాలం తెలంగాణ నేతల్లో రేవంత్‌కు ఉన్న పరపతి మరొకరికి లేదని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్‌ను వీడి, సైకిల్ ఎక్కి, ఆ పగ్గాలు చేపడతారా అనే చర్చ సాగుతోంది. ఈ చర్చకు ఫుల్స్టాప్ పెట్టే ఉద్దేశ్యంలో భాగంగా కూడా ఆయన ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ తీరు భిన్నంగా ఉందని, పైకి ఎదగడం కోసం సొంత పార్టీ సీనియర్లు, తాను ఎదిగేందుకు తోడ్పడిన సంస్థ, తాను గురువుగా భావించే చంద్రబాబు.. ఇలా ఎవరినైనా లెక్క చేసేలా లేరని అంటున్నారు.