వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఫోన్ చేశారు. రాజకీయంగా ఈ రెండు పార్టీల నేతలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటిది వారు ఒకరికి మరొకరు ఫోన్ చేసుకోవడం ఏంటా అనే సందేహం కలుగుతోందా..? వీరు ఇరువురు తారకరత్నకు బంధువులు కావడం ఇక్కడ కామన్ పాయింట్.
ఇంతకీ మ్యాటరేంటంటే… లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొన్నటి వరకు బాలయ్య దగ్గరుండి మరీ చూసుకున్నారు. కాగా..తాజాగా నందమూరి తారకరత్న ని విజయసాయిరెడ్డి బెంగళూరు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తారకరత్న ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని అయితే కుప్పంలో 45 నిమిషాల పాటు హార్ట్ ఆగిపోవడంతో మెదడుకు రక్త ప్రసరణ జరగలేదని దీంతో మెదడు పైభాగంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రత్యేక కేర్ తీసుకుని ఆయన కోలుకునేలా చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి స్వయానా బాబాయి.. కావడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. ఆయన అక్కడకు వెళ్లి వచ్చారనే విషయం తెలియడంతో… బాలయ్య ఫోన్ చేసినట్లు సమాచారం. విజయసాయి రెడ్డికి కాల్ చేసిన బాలకృష్ణ మీరు వెళ్లినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. తారకరత్నకు అందుతున్న ..అందించాల్సిన వైద్యంపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు.