ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద్ది రోజుల్లో తాను అక్కడకు షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు జగన్… ఈ వ్యాఖ్యల వెనుక విపక్షాలు ఆరోపించినట్లు రాజకీయ కోణం ఉందా.. లేదా? యథాలాపంగా చేసిన వ్యాఖ్యలా? అనే అంశాలను పక్కన పెడితే, సాగరతీర నగరం రాజధాని అంటూ దేశ రాజధాని ఢిల్లీలో గట్టిగా చెప్పడం ద్వారా ఇప్పటికే ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఏపీకి మరింత నష్టం చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
visaka
టెక్నికల్‌గా ఆంధ్రప్రదేశ్ పాత రాష్ట్రం కాగా, తెలంగాణ కొత్తది. కానీ హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరం విభజన తర్వాత తెలంగాణ రాజధానిగా ఉండటంతో, విభజిత ఆంధ్రప్రదేశ్ వైపు మొదటి నుండి ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు కనీసం ఒంటి కన్నుతో కూడా చూడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తోంది. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే… పెట్టుబడులను ఆకర్షించాలంటే… ఏపీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తమకు అనుగుణంగా ఉండే ప్రాంతాన్ని రాజధానిగా చెబుతూ వెళ్తుంటే, మొదటికే మోసం వస్తోంది. పరిశ్రమలు రావడం మాట అటుంచితే, ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మొదట చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. పెట్టుబడులను కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేశారు… రూట్ ఏర్పడుతున్న దశలో వైసీపీ ప్రభుత్వం వచ్చి, మూడు రాజధానులను తెరపైకి తీసుకు వచ్చింది. ఇది ఇన్వెస్టర్లను గందరగోళానికి గురి చేసిన అంశం. అమరావతిని శాసన, విశాఖపట్టణాన్ని పరిపాలన, కర్నూలును న్యాయ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి చెబుతోంది. ఇప్పుడు విశాఖ రాజధాని అంటూ జగన్ మళ్లీ కన్ఫ్యూజ్లో పడేశారని అంటున్నారు.
amaravati
అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించినందున, జగన్ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. అందుకే మూడు రాజధానులు అంటూ తెరపైకి తీసుకు వచ్చింది. జగన్ చూపు విశాఖ వైపే ఉంది. పోర్ట్ ఉండి… ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉండటం, విభజన నాటికే ఏపీలో అభివృద్ధి చెందిన నగరంగా పేరుండటం, తెలుగు రాష్ట్రాల్లో ఐటీలో హైదరాబాద్ తర్వాత విశాఖ వెలుగొందుతుండటం వంటి వివిధ కారణాలు… వైసీపీ ప్రభుత్వం ఇటు చూసిందని భావించవచ్చు. దీనిని మరింత అభివృద్ధి చేసి, బలమైన ఆర్థిక రాజధానిగా నిలబెట్టాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ రాజధానిపై అదే ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఏపీకి నిర్దిష్ట రాజధాని లేనందున, అధికారంలో ఉన్న పార్టీ రాజధానిని మార్చే అవకాశాలు ఉన్నందున పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూసేందుకు జంకుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడున్న ప్రభుత్వమే మూడు రాజధానులు అని చెబుతూనే, ఇప్పుడు విశాఖే రాజధాని అంటూ చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోన్న అంశం. విశాఖను కీలక శాసన రాజధానిగా చేయాలని భావిస్తున్నారు కాబట్టి.. జగన్ అలా అని ఉండవచ్చు. కానీ రాజధానుల అంశం కోర్టుకే ఎక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీయే భిన్న వాదనలు వినిపిస్తే పరిశ్రమలను ఎలా ఆకర్షిస్తారనే ప్రశ్న వినిపిస్తోంది.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధాని చేసి, ఇక్కడకు పరిశ్రమలను రప్పించే ప్రయత్నం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురానికి కియా, విశాఖకు కొన్ని పరిశ్రమలను ఆకర్షించారు. 2019లో వైసీపీ వచ్చాక ఒక రాజధాని మూడుగా మారింది. 2024లో వైసీపీ అధికారంలోకి వస్తే సమస్య లేదు. కానీ టీడీపీ గెలిస్తే మాత్రం అప్పుడు మళ్లీ అమరావతిని మాత్రమే రాజధాని చేస్తారా? ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు మూడు రాజధానులను కొనసాగిస్తారా? అనే భయమే ఇన్వెస్టర్లను ఏపీకి దూరం చేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తీరు కారణంగా పరిశ్రమలు రావడం మాట పక్కన పెడితే, కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని గుర్తు చేస్తున్నారు. అనంతపురంలో కియా కూడా తమిళనాడుకు ప్లాంటు మార్చే ప్రయత్నం చేసి, చివరలో వెనక్కి తగ్గిందని గుర్తు చేస్తున్నారు.
రాజధాని అంశం కొలిక్కి రానంత వరకు ఇప్పటికే ఆర్థికంగా బక్క చిక్కి, ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వైపు ఇన్వెస్టర్లు చూసే అవకాశాలు తక్కువే అంటున్నారు. రాజకీయ ప్రతీకారం కోసం భారీ పెట్టుబడులు… తద్వారా వచ్చే ఉద్యోగాలు, ఉపాధి అంశాలను కూడా నాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విభజన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు కావొస్తుంది. రాజధాని, రాజకీయ గందరగోళం లేకుంటే ఇప్పటికే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి, యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అంటున్నారు. ఇదే కాలంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటకకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాయని గుర్తు చేస్తున్నారు. ఏపీలోని పార్టీల చర్యల వల్ల పెట్టుబడులు రాక.. రాష్ట్రమే ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, రాజధాని విషయం కొనసాగినంత కాలం ఏపీ వైపు పరిశ్రమలు చూసే అవకాశాలు తాజా వ్యాఖ్యల ద్వారా మరింత సన్నగిల్లాయని అంటున్నారు.