కృష్ణం రాజు ఆశయాలను ప్రభాస్ పూర్తి చేయాలని మంత్రి రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారని.. ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కిందని రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని గుర్తుచేసుకున్నారు. కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటని రోజా అన్నారు. చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులతో కలిసి మంత్రి రోజా .. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భౌతికంగా ఆయన దూరమైన ఈ ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరని రోజా అన్నారు. కృష్ణం రాజు సినిమాల్లోనే రెబల్ స్టార్ అని.. రాజకీయాల్లో మాత్రం పీపుల్స్ స్టార్ అని ప్రశంసించారు. కృష్ణం రాజు ఆశయాలకు తగ్గట్టు హీరో ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణం రాజుకి వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం వుందని గుర్తుచేసుకున్నారు.
కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగాను.. మొగల్తూరు తీర ప్రాంతంలో రెండు ఏకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి వేణు తెలిపారు. సినీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి సీఎం జగన్ తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఇస్తారని ఈ సందర్భంగా మంత్రి వేణు అన్నారు.
మొగల్తూరు లో పుట్టి సినీరంగం, రాజకీయ రంగంలో కృష్ణం రాజు రాణించడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని చీఫ్ విప్ ముదునూరి అన్నారు. కృష్ణం రాజు గుర్తుగా తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా అక్కడకు వచ్చిన హీరో ప్రభాస్‌ను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు, పాలకొల్లు వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ కలిశారు. కృష్ణంరాజుతో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.