తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కలిసి కట్టుగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేసారు. నియోజకవర్గంలో గడపగడప నిర్వహణ పైన ఆరా తీసారు. ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనుల కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే ఉండాలని స్పష్టం చేసారు. రోజూ 6 గంటలపాటు సమయం నియోజకవర్గంలో ప్రజలు – కార్యకర్తల మధ్యే ఎమ్మెల్యేలు..పార్టీ ఇంఛార్జ్ లు ఉంటున్నారని చెప్పారు.
ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. స్థానికంగా ప్రజల నుంచి సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం గడపగడపకూ కార్యక్రమం ద్వారా కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ప్రత్యక్ష నగదు బదిలీద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగిందని సీఎం జగన్ పార్టీ నేతలకు వివరించారు.