Ap:ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తన పత్రిక సర్క్యులేషన్‌ను పెంచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ను 5లక్షలకు పెంచడంతోపాటు చందాలను పన్నుల నుంచే చెల్లిస్తున్నారని ఆరోపించారు. సచివాలయానికి రెండు పత్రికలు చెప్పున 60వేల సాక్షి పత్రికలు వేస్తున్నారు. లక్షల గ్రామ వాలంటీర్లు ఈ పత్రికను తీసుకుంటున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సాక్షి పత్రిక వేస్తున్నారు. ఇలా చూస్తే మొత్తం 5లక్షల కాపీలకు ఏపీ ప్రభుత్వం చందా కడుతోందని తెలిపారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అవినీతితో పత్రిక ఆవిర్భవించిందని.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలతో పత్రిక, ఛానల్ పెట్టారని వెంకట రమణారెడ్డి ఆరోపించారు. పత్రికలో లక్షల కాపీలకు చందా రూపంలో రూ.400 కోట్ల ప్రజాధనాన్ని పెడుతున్నారు. ఇదీ మోసం కాదా..? దొంగతనం అంటారా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నడిపేది కూడా ఆ ప్రతిక నుంచి ఉద్యోగులేనని ఆరోపణలు గుప్పించారు. పత్రికలో పనిచేసిన వారినే ప్రభుత్వ, ముఖ్యమంత్రి సలహాదారులుగా, అకాడమీ ఛైర్మన్లుగా, పౌరసంబంధాల అధికారులుగా నియమించారు. ప్రజల సొమ్మునే జీతాలుగా ఇస్తున్నారు. ఇలా చూస్తే దాదాపు రూ.1200 కోట్లకు పైగా ప్రజల సొమ్మును ఆ పత్రికకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రజాధనాన్ని దోచి.. చంద్రబాబు నాయుడు దోచారని చెబుతున్నారని ధ్వజమెత్తారు. పెద్ద మొత్తంలో పన్నులు కడుతున్నారంటే ఆదాయం ఉన్నట్టేగా.. రాకెట్ కంటే వేగంగా జగన్ ఆర్థికంగా ఎదిగారు అనడానికి చెల్లించే పన్నులు నిదర్శనం అని వెంకట రమణారెడ్డి తెలిపారు.