Rain Alert: ఏపీకి అలర్ట్..మరో 24 గంటల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి.
నేడు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మరో 24 గంటల్లో బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
వర్షాల సంగతి ఇలా ఉంటే.. రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చలి పులి బాగా వణికిస్తోంది. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుఫాన్ తర్వాత నుంచి ఈ చలి వాతావరణం మరింతగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం కూడా ఉంటోంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.