»Sabarimala Huge Crowd Of Devotees Back Without Darshan
Shabarimala: భారీగా భక్తుల రద్దీ..దర్శనం కాకుండానే వెనక్కి!
శబరిమల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నా కూడా దర్శనం కాకపోయే సరికి పలువురు భక్తులు తిరుగుపయనమవుతున్నారు.
Shabarimala: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ భారీగా ఉండటంతో గంటల తరబడి లైన్లో నిల్చున్నా కూడా దర్శనం కానీ పరిస్థితి ఏర్పడుతుంది. దర్శనానికి సుమారు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ లైన్లో వేచి చూస్తున్నా కూడా నిర్వహకులు కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి లైన్లో నిల్చుని దర్శనం కాకపోయే సరికి పలువురు భక్తులు తిరిగి పయనమవుతున్నారు. కొందరు భక్తులు శబరిబమల కొండ దిగి పందళంలో ఉన్న వలియాకోయికల్ శ్రీధర్మ శాస్త్రా ఆలయంలో అయ్యప్పకు నెయ్యితో పూజలు చేసి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.
శబరిమలకు వెళ్లే రహదారుల్లో నిన్న కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత అయిదు రోజుల నుంచి రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. రద్దీ కారణంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది యాత్రికులు కొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారని తెలిసింది. ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్, కేరళ పోలీసులు రద్దీని నియంత్రించడంలో వైఫల్యం చెందారు. దేవస్వోమ్ బోర్డు ఇప్పుడు స్పాట్ బుకింగ్లలో ఐదు రెట్లు కంటే ఎక్కువ మందిని అనుమతి చేయడం వల్లే రద్దీ ఎక్కువైందని పోలీసులు అంటున్నారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు.