ఇప్పుడు అంతా పాదయాత్రల కాలం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనవరి 26వ తేదీన పాదయాత్రను ప్రారంభించే అవకాశమున్నట్లు ఆ పార్టీ ఏపీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పాదయాత్ర ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ పాదయాత్ర ద్వారా తమ పార్టీలో పునరుత్తేజం తీసుకు వస్తామని, తిరిగి పుంజుకోవడం ఖాయమన్నారు. చాలా సీనియర్ నేతలతో తనకు పని చేసే అవకాశం రావడం తన అదృష్టమని, తాను పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్థితిపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ సీనియర్లు కూడా తనకు సహకరించాలని, ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
పొత్తుల గురించి మాట్లాడుతూ, అది తమ పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, యువత కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. పేదలకు ఇళ్ళ కేటాయింపు అంశానికి కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పోరేషన్స్ నిర్వీర్యమయ్యాయని చెప్పారు. జగన్ కేవలం వైయస్ రాజశేఖరరెడ్డికి కొడుకు మాత్రమేనని, కానీ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు.