ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలె ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెట ప్రాంతంలో ఆయనకు సొంత ఫిలిం స్టూడియో ఉండటం వల్ల ఎక్కువగా అక్కడ గడుపుతుంటారు. ఈ స్టూడియోలో రెగ్యులర్ గా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. తాజాగా ఈ ఫిలిం స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడియోలో ప్రస్తుతం ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. 30 అడుగుల ఎత్తులో లైట్ ను ఏర్పాటు చేసే తరుణంలో కుమార్ అనే లైట్ మ్యాన్ ప్రమాదానికి గురయ్యారు. పైనుంచి ఆయన కింద పడటం వల్ల తీవ్ర గాయాలు అయ్యాయి. స్టూడియో సిబ్బంది ఆయన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. లైట్ మ్యాన్ మరణంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.