»Iifa 2023 Kamal Haasan To Be Honoured With Outstanding Achievement In Indian Cinema Award
IIFA 2023: అరుదైన అవార్డు అందుకోనున్న కమల్ హాసన్..!
విలక్షణ నటుడు కమల్ హాసన్ అరుదైన అవార్డు అందుకోనున్నాడు. ఇప్పటి వరకు చాలా అవార్డులు అందుకున్న ఆయన, మరో అవార్డు అందుకోనున్నాడు. ఆయన దాదాపు ఆరు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఇన్ని సంవత్సరాలపాటుగా సినీరంగానికి సేవలు అందించినందుకు గాను కమల్ హాసన్ కు ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది. ఈ నెల 27న అబుదాబిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (IIFA 2023) కార్యక్రమంలో కమలహాసన్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఐఫా నిర్వాహకులు వెల్లడించారు. కమల్ కు ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం రావడంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కమల్, ఇప్పటి వరకు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ లాంటి పలు భాషల్లో దాదాపు 232 పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, రివార్డులు ఆయనకు దక్కాయి. ప్రస్తుతం కమలహాసన్.. దర్శకుడు శంకర దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాను నటించిన సన్నివేశాలకు కమల్ డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.