నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని బాబాయ్ బాలయ్య కూడా అఖండ దీపారాధనను మొదలు పెట్టారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి అడ్డంకులు తొలగించుకోవడానికి అఖండ దీపారాధన చేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా తారకరత్న కోసం మృత్యుంజయ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తున్నాడు. బాలయ్య, తన పీఎ రవి ఆ దీపారధన పనులు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి మండలం బత్తలాపురంలో ఉన్నటువంటి మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ కఠోర దీక్ష నియమబద్దంగా బాలయ్య పర్యవేక్షణలో సాగుతోంది.
ఈ అఖండ దీపారాధన సంకల్పమే తారకరత్నను గండం నుంచి గట్టెక్కిస్తోందని నందమూరి కుటుంబంతో పాటుగా అభిమానులూ విశ్వసిస్తున్నారు. ఆలయంలో అఖండ జ్యోతి దాదాపు 44 రోజులు కొనసాగనుందని, బాలకృష్ణ ఎక్కడున్నా ఈ జ్యోతి వెలుగుతూ ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. తారకరత్న విషయంలో బాబాయ్ బాలయ్య ప్రయత్నాలు ఫలించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ తారకరత్న’ అంటూ పోస్టులు పెడుతున్నారు.