hyderabad city buses : తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఎక్కువగా వీటిలో ప్రయాణిస్తున్నారు. కళాశాలలు, కార్యాలయాలకు చేరుకునే సమయంలో ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో కండక్టరుకు టికెట్లు జారీ చేయడం కూడా చాలా కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ (hyderabad city) వ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో తిరిగే బస్సుల్లో సీటింగ్ లేయవుట్(seating Layout)ని మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణంగా సిటీ బస్సు(city buses)లో అన్ని సీట్లు అడ్డంగా ఉంటాయి. అయితే బస్సు ముందు భాగంలో ఉండే సీట్లను అడ్డంగా తీసేసి, మెట్రో రైలులో మాదిరిగా అడ్డంగా వేసేందుకు పనులు మొదలు పెట్టారు. ఇలా చేయడం వల్ల బస్సులో రెండు సీట్లు తగ్గుతాయి. దీంతో పాటు నిలబడి ప్రయాణం చేసే వారికి ఎక్కువ స్థలం వస్తుంది. కాబట్టి రద్దీని ఈ విధంగా కొంత వరకు హ్యాండిల్ చేయవచ్చని ఆర్టీసీ భావిస్తోంది.
గతంలో ఈ బస్సుల్లో దాదాపుగా రోజుకు 11 లక్షల మంది ప్రయాణించే వారు. అదే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత రోజుకు 18 నుంచి 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు రెండింతలకు పైగా పెరిగిపోయారు. అయితే కండక్టర్ వీరికి కూడా జీరో టికెట్‌ని జారీ చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువ కావడంతో ఈ పనులు చాలా సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో సీటింగ్ మార్చడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.