విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
IND vs ENG: విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ ముందు 394 పరుగుల టార్గెట్ను ఉంచింది. యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ బాదడంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 255 పరుగులు చేయగలిగింది.గత కొంతకాలంగా విఫలమవుతున్న శుభమన్ గిల్.. విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 131 బంతులను ఎదుర్కొని టెస్టుల్లో మూడో సెంచరీ సాధించాడు.
ఓవర్నైట్ స్కోర్ 28-0తో శనివారం ఆట ప్రారంభించిన భారత జట్టు.. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ వెంటనే యశస్వి జైశ్వాల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్ కూడా విఫలమయ్యారు. దీంతో 122 పరుగులకే భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శుభ్ మన్ గిల్, అక్షర్ పటేల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఇటీవలి కాలంలో జరిగిన టెస్టు మ్యాచులలో గిల్ ప్రదర్శన బాగాలేదు. తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చి సెంచరీ బాదడంతో గిల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.