తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సీఎం సీట్లో కుక్కను కూర్చోబెట్టినా బుద్దిమారదంటూ ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ పై పలువురు పెదవివిరుస్తున్నారు.
శునకాన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టినా బుద్ది మారదంటూ బీఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరోక్షంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మంచి ముహూర్తం చూసుకుని శునకాన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టినా కూడా బుద్ది మారదని, తాను రేవంత్ రెడ్డి గురించి అనవసరంగా మాట్లాడి నోరు పాడు చేసుకోనని అన్నారు. కాంగ్రెస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు అసహనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నట్లు కనిపించడం లేదని, వారంతా ప్రతిపక్షంలో ఉన్నట్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పొత్త రాజకీయాలు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలపై నోరు పారేసుకోవడం తప్పా వారేమీ చేయట్లేదన్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణక్ష్ంతోనే బీజేపీ, కాంగ్రెస్ బండారం బయట పడిందని కేేటీఆర్ చురకలంటించారు. ఈ తరుణంలో కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు అనే క్యాప్షన్ తో కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి’ అనే పద్యాన్ని ఆయన షేర్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.