ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అధికార పార్టీ వాళ్లు తట్టుకోలేరు. ఎక్కడైనా బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక భౌతిక దాడులే. అలాంటిది పక్కన ఉండగానే తన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటారా? లేదు కదా. కర్ణాటకలో అలాంటి సంఘటనే జరిగింది. ఓ స్వామిజీ బెంగళూరులో వరదల గురించి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అడ్డుకున్నారు. స్వామిజీ చేతుల్లో మైక్ లాక్కున్నారు. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని మహదేవపురలో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. బహిరంగ సభలో కాగినేలే మహా సంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామితో కలిసి బసవరాజ్ బొమ్మై వేదిక పంచుకున్నారు. ఇటీవల బెంగళూరులో రోడ్ల పరిస్థితి, వరదల విషయమై స్వామి ఈశ్వరనందపురి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం బొమ్మై గతంలో హామీ ఇచ్చి మరచిపోయారు అని తెలిపారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం అలసత్వ ధోరణిపై మాట్లాడుతుండగా హఠాత్పరిణామం జరిగింది.
పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి బొమ్మై అసహనంతో స్వామి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. తాను హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రి కాదని బొమ్మై సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కేవలం హామీ కాదు దానిపై ఓ పథకం తీసుకొస్తామని సీఎం తెలిపారు. నిధులు కేటాయించామని, పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. అనంతరం సమావేశం యథావిధిగా జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే స్వాగతించాలి తప్ప ఎదురుదాడి చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలి కానీ ఇలా మైక్ లు లాక్కోవడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.
#Karnataka CM #BasavarajBommai snatches mic from seer on stage to answer criticism on infra issues. Says, 'I do my job'.