నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్టణం జిల్లా చినముషిడివాడకు చెందిన చిరంజీవి, మౌనిక వివాహం రెండు నెలల కిందట నిశ్చయమైంది. ఈనెల 26న జరిగే పెళ్లి కోసం శారదాపీఠం పక్కన ఉన్న పోర్టు కల్యాణ మండపం నెలన్నర కిందట బుక్ చేసుకున్నారు. అయితే శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వస్తున్నారని నిర్వాహకులకు సమాచారం అందింది. ఆ సమయంలో మండపంలో ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదని స్థానిక యంత్రాంగం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో అకస్మాత్తుగా మండపం ఇవ్వలేమని నిర్వాహకులు చెప్పేశారు. మండపం రద్దవడంతో ఆ కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే సమీపంలోని దాట్ల మేన్షన్ ను బుక్ చేశారు. ఆ ఫంక్షన్ హాల్ లోనే గురువారం మౌనిక, చిరంజీవి పెళ్లి ప్రశాంతంగా జరిగింది.
కాగా.. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం నానా హడావుడి చేస్తున్నారు. వారి అత్యుత్సాహంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ రెండు వారాల ముందు నుంచే ఆంక్షలు మొదలవుతున్నాయి. పర్యటన సమీపిస్తున్న కొద్దీ స్థానికంగా ఆంక్షలు తీవ్రం చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు తమ పనులు చేసుకోలేకపోతున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూసి వేస్తుండడం పలు విమర్శలకు దారి తీస్తోంది.