‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం.
లోకేశ్ తో పాటు పాదయాత్రను ప్రారంభించిన అనంతరం తారకరత్న అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుప్పంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. తారకరత్నను టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించనున్నారు. ‘కేసీ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే పల్స్ లేదు. వెంటనే చికిత్స అందించడంతో 45 నిమిషాల తర్వాత పల్స్ మొదలైంది. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’ అని వైద్యులు చెప్పారు. కాగా అతడికి గుండెపోటు వచ్చిందని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
బెంగళూరు తరలిస్తాం..: బాలకృష్ణ
‘తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అభిమానులు చెందాల్సిన అవసరం లేదు. గుండెలో ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. మిగతా రిపోర్టులు బాగున్నాయి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న బీపీని అదుపులోనే ఉంచి వైద్య అందిస్తున్నారు. వైద్యులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం. ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు’ అని బాలకృష్ణ తెలిపారు.