»Myanmar Myanmar Soldiers Entered India To Save Lives
Myanmar: ప్రాణాలను రక్షించుకునేందుకు భారత్లోకి ప్రవేశించిన మయన్మార్ సైనికులు
పొరుగు దేశమైన మయన్మార్లో కొంతకాలం నుంచి మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈక్రమంలో తాజాగా 151 మంది మయన్మార్ సైనికులు అక్కడినుంచి పారిపోయి మిజోరంలోకి ప్రవేశించారు.
Myanmar: పొరుగు దేశమైన మయన్మార్లో కొంతకాలం నుంచి పరిస్థితులు సరిగ్గా లేవు. అక్కడి మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈక్రమంలోనే తాజాగా 151 మంది మయన్మార్ సైనికులు అక్కడినుంచి పారిపోయి మిజోరంలోకి ప్రవేశించారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉండే సైనిక శిబిరాలను అరకాన్ సాయుధ బృందాలు ఆక్రమించాయి. దీంతో అక్కడ వారంత ఆయుధాలతో సహా ఇక్కడికి వచ్చారని అస్సాం రైఫిల్స్ తెలిపాయి.
గత కొద్ది రోజులుగా మయన్మార్లో సైన్యం, అరకాన్ సాయుధ బృందం మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈక్రమంలో జరిగిన ఓ దాడిలో ప్రాణాలు కాపాడుకునేందుకు 151 మంది సైనికులు అక్కడి నుంచి మిజోరంలోని లాంగ్త్లయ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల గుండా భారత్లోకి ప్రవేశించారు. ఆర్మీ సిబ్బందిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం వాళ్లు సురక్షితంగా ఉన్నారు. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం మధ్య ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి.
కొన్ని రోజుల్లో మయన్మార్ సైనికులు తిరిగి వారి దేశానికి పంపిస్తామని అస్సాం రైఫిల్స్ అధికారులు వివరించారు. ఈ ఏడాది నవంబర్లోనూ 104 మంది సైనికులు భారత్లోకి ప్రవేశించగా వాళ్లను తిరిగి పంపించారు. ఈ విషయాలపై మయన్మార్-భారత్ సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న అస్సాం రైఫిల్స్ ఇప్పటికే అప్రమత్తమైంది. మయన్మార్ నుంచి వచ్చి మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య 32వేలకు పైగా ఉండవచ్చని అంచనా.