»Ap On Alert For Corona 10 Rapid Kits For Each Gram Panchayat
Corona : కరోనా పట్ల అలర్ట్ అయిన ఏపీ.. ప్రతి గ్రామ పంచాయతీకి 10 రాపిడ్ కిట్లు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 33 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లుగా వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు తెలిపారు.
కరోనా కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు వెల్లడించారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఏపీలోని 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయానికీ పది ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో 33 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లుగా వివరించారు. వెంటిలేటర్లకు, కొవిడ్ మందులకి కొరత లేదని, జ్వరంతో బాధపడుతున్న రోగులను ర్యాపిడ్ కిట్లతో పరీక్షించి వారిలో పాజిటివ్ వస్తేనే వారి శాంపిళ్లను ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు.
పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జేఎన్ 1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. మాస్క్ ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వస్తే వైద్యులను సంప్రదించి మందులు వేసుకోవాలని కోరారు.