CM Revanth: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఫ్రీ పవర్ ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ (CM Revanth) స్పష్టంచేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యుత్ సంస్థల అప్పు రూ.81, 516 కోట్లు ఉందనే అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై కాస్త ఆందోళన నెలకొంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్‌పై అప్పు రూ.22,423 కోట్లుగా ఉండే.. ఉచిత విద్యుత్ నేపథ్యంలో అది పెరుగుతూ వచ్చింది. ట్రాన్స్ కో, జెన్ కో, మిగతా సంస్థలు అప్పుల, నష్టాల వివరాలను సమీక్ష సమావేవంలో వెల్లడించాయి. విద్యుత్ కొనుగోలు చేసి, బిల్లుల చెల్లింపు కోసం డిస్కంలు స్వల్పకాలిన రుణం కింద రూ.30,406 కోట్ల అప్పు తీసుకుంది. ఆ వడ్డీ నెలకు రూ. వెయ్యి కోట్ల చొప్పున చెల్లిస్తున్నారు. ఏడాదిలో ఆదాయం రూ.22,781 కోట్లు ఉంటే.. ఖర్చు మాత్రం రూ.33,839 కోట్లుగా ఉంది. ఆదాయం, వ్యయం మధ్య రూ.11,058 కోట్ల తేడా ఉంది.
రెండు డిస్కంల నష్టం రూ.50,275 కోట్లకు చేరాయి. వ్యవసాయానికి అందజేసే ఉచిత విద్యుత్‌కు సంబంధించి లెక్కపత్రాలు లేవు. రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగంలో 40 శాతం వ్యవసాయానికి ఉండే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.82 కోట్ల కరెంట్ కనెక్షన్లు ఉండగా.. తలసరి వార్షిక వినియోగం 2349 యూనిట్లు ఉంది.
రాష్ట్రంలో అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలను ఆదేశించామని సీఎం రేవంత్ (CM Revanth) స్పష్టంచేశారు. 6 గ్యారెంటీల అమలులో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తారు. అందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసి.. అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇలా చేస్తే ప్రభుత్వం రూ.4 వేల కోట్ల వరకు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.