నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికారులు ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేడు కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుందో లేదోనని తెలియాల్సి ఉంది. ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ల ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ఉండనున్నారు. ఉదయం 8.30 గంటలకు గవర్నర్ తమిళసై ఆయనతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
దాదాపు నాలుగు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాల్లో మొదటి రోజు మాత్రం సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ తర్వాత సభను వాయిదా వేయనున్నారు. తిరిగి సమావేశాలు డిసెంబర్ 13వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా చర్చలు సాగనున్నాయి.
ఇకపోతే స్పీకర్ ఎన్నికకు సంబంధించి నేడు పలు చర్చలు సాగనున్నాయి. ఈ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయగా నోటిఫికేషన్ విడుదలయ్యాక సభ్యులు ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.