ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్..విభజన హామీలపై కేసీఆర్ మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర విభజన సమయంలో కరెంటు కేటాయింపు కోసం కొట్లాడటం వల్ల 53శాతం విద్యుత్‌ను తెలంగాణకు కేటాయించారని, తెలంగాణ విద్యుత్ అవసరం, బోర్ల మీద ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించి సోనియా, మన్మోహన్ సింగ్‌లు విభజన చట్టంలో నిబంధనలు చేర్చారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ మొదటి సమావేశంలోనే ఏడు మండలాలను, సీలేరు విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రాలో కలిపేశారని కేసీఆర్ ఆరోపించారు. మోదీ అత్యంత ఫాసిస్టు ప్రధానమంత్రి అని అదే సమయంలో విమర్శించానని కేసీఆర్ గుర్తు చేశారు. 460 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును బలవంతంగా ఏపీలో విలీనం చేశారని కేసీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉండి రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంపై అభ్యంతరాలు వచ్చినా తాను ఖాతరు చేయలేదని, ముంపు మండలాల విలీనం పేరుతో కర్కశంగా వ్యవహరించారని ఆరోపించారు.
విద్యుత్ రంగ సంస్కరణల పేరుతో మీటర్ల పెడుతున్నారని, దీని పర్యావసానాలు ఇప్పుడే తెలియవని, భవిష్యత్తులో సామాన్య ప్రజలు విద్యుత్‌ను భరించలేని పరిస్థితి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా రాష్ట్రంలో కరెంటు కష్టాలు మాత్రం తప్పడం లేదని సిఎం కేసీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది బాధ్యత అనే సంగతి గుర్తుంచుకోవాలని, కేంద్రం చట్టాలు చేసేప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి చేయాల్సిన చట్టాల జాబితాలో విద్యుత్ కూడా ఉందన్నారు. రాష్ట్రాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా కరెంటు చట్టాలను చేయడాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్ష సభ్యుడు పార్లమెంటులో ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగుతున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో పేదలు, రైతులు, కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునే విధానాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. కేంద్ర చట్టం అన్యాయమైన చట్టమని, దాని వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించాలని కేంద్రం లేఖలపై లేఖలు రాస్తుందని, అలా అమ్మే వారికి బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసిని అమ్మేయాలని తరచూ లేఖలు రాస్తున్నారని ఆరోపించారు.