»These Are The Reasons For Congresss Victory In Telangana
Congress: కాంగ్రెస్ విజయానికి కారణాలు ఇవే?
ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పుడు కూడా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్సే వస్తుందన్న భావన రాజకీయ వర్గాల్లో ఉండేది. మెజార్టీ రాజకీయ విశ్లేషకులు, నాయకులంతా ఇదే అంచనా వేశారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. సర్వేల అంచనాలన్ని తారుమారయ్యాయి. అసలు ఎన్నికల హడావుడి మొదలయిన దగ్గర నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అయితే కాంగ్రెస్ గెలుపునకు కారణాలు ఏంటి ? తెలంగాణలో హస్తం గాలి ఎలా వీచింది? తెలంగాణ ప్రజలు కారుకు కాకుండా చేయి గుర్తువైపు ఎందుకు టర్న్ అయ్యారు?
These are the reasons for Congress's victory in Telangana
Congress: సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతపుంతలు తొక్కుతూ రాష్ట్రమంతటా విజయఢంకాను మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి(Revanth reddy). మొత్తం పార్టీ అంతా తానై నడిపించారు. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టారు. సీనియర్ల అలిగినా కూడా నచ్చ చెప్పారు. అందరిని తనదారికి తెచ్చుకున్నారు. పార్టీని ఏకం చేసి బలంగా ముందుకు తీసుకెళ్ళారు. ఏకంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనే బరిలోకి దిగి పార్టీ కేడర్‌లో జోష్ని నింపారు. కేసీఆర్‌ను వెనక్కు నెట్టి అక్కడ రేవంత్ రెడ్డి రెండో స్థానంలో నిలిచి సత్తా చాటి కాంగ్రెస్ వేవ్‌లో కీ రోల్ పోషించారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్(Congress) గెలుపు కూడా తెలంగాణ ఎన్నికలపై పడిందనే చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ని నింపింది. కర్నాటకలో ప్రకటించిన పథకాల ఐడియానే తెలంగాణలో కూడా అమలు చేయడం కలిసి వచ్చింది. ఎన్నికల హామీలతో పాటు కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత కూడ ఆ పార్టీకి ఫ్లస్ అయ్యింది. ఎన్నికలు జరుగుతాయని తెలిసిన దగ్గర నుంచీ పార్టీ అంతా ఒక్కతాటి మీదనే నడిచింది.ఈ ఐకమత్యమే కాంగ్రెస్‌కు చాలా కలిసి వచ్చింది. పెద్ద నేతలందరూ ఒక్క మాట మీదనే నిలబడ్డారు. పార్టీ గెలిచిన తర్వాతే ఇతర విషయాలపై ఫోకస్ పెట్టాలనే అభిప్రాయంతో సీనియర్లు ముందుకు కదిలారు. అదే సమయంలో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసే వ్యూహంతో వెళ్లారు కాంగ్రెస్ నేతలు.ఈ వ్యూహం కాంగ్రెస్‌కు మరింత కలిసి వచ్చింది. అభ్యర్ధులను ఎన్నుకోవడం, ప్రకటించడం అన్నింటిలోనూ కలిసికట్టుగా పనిచేశారు.ఇక ఎన్నికల ప్రచారంలో కూడా కలిసి ముందుకు సాగారు. ఇవన్నీ కూడా గెలుపును బాగా ప్రభావితం చేశాయి.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో ఆ పార్టీ మేనిఫెస్టో కీలక పాత్ర పోషించింది. కర్ణాటక మాదిరిగానే ఆరు గ్యారెంటీలను ప్రకటించడం…బీఆర్ఎస్ కన్నా ముందే మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళడం ఆపార్టీకి బాగా కలిసొచ్చింది. ఈ మేనిఫెస్టోనే ప్రజల్లోకి వెళ్లింది. మహాలక్ష్మీ పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం, చేయూత, రైతుభరోసా స్కీంలు ప్రజల్ని కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేశాయి. వీటికి తోడు ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కారణం అయ్యింది. ఇవే కాకుండా తెలంగాణ యువత అత్యంత అసంతృప్తిగా ఉన్న ఉద్యోగాల విషయం కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం అద్భుతంగా పని చేసిందనే చెప్పాలి. అధికారంలోకి వచ్చాక ఎప్పుడెప్పుడు ఏఏ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నది డేట్లతో సహా ఎన్నికలకన్నా ముందే చెప్పడం తెలంగాణ ప్రజలను ఆకట్టుకుందనే చెప్పాలి. మెజారిటీ యువత కాంగ్రెస్ వైపుకు మొగ్గడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పొచ్చు.
మరోవైపు ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ల నుండి కీలకనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడ ఆపార్టీకి మరింత ఊపును తీసుకువచ్చింది. కాంగ్రెస్‌లో చేరిన నేతలు కూడ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చేసిన ప్రచారం కూడ కాంగ్రెస్‌కు మరింత కలిసి వచ్చింది. ఆరు పథకాలను ప్రకటించడం దగ్గర నుంచీ ముందు నుంచీ గెలుపు తమదే అని ప్రచారం చేయడం వరకు అన్నీ కాన్ఫిడెన్స్ గా చేసింది. ఇది వారికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇది ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పాజిటివిటీని పెంచింది. దీంతో పాటూ డిసెంబర్ 9న సీఎం ప్రమాణం స్వీకారం ఉంటుందని రేవంత్‌రెడ్డి ప్రకటించడం కూడా ఆ పార్టీ గెలుపు నమ్మకాన్ని తెలంగాణ ప్రజలకు చూపించింది. కాంగ్రెస్ గెలవడానికి సోషల్ మీడియా కూడా ముఖ్య కారణమయ్యిందనే చెప్పాలి. వీటిల్లో ఇచ్చిన యాడ్ లు, పాటలు లాంటివి కాంగ్రెస్‌ను ప్రజల్లోకి విపరీతంగా తీసుకువెళ్ళాయి. ‘మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి’ అన్న నినాదం చిన్న పిల్లల నోట్లో కూడా వినిపించిందంటే అర్ధం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పాపులర్ అయిందో. అంతేకాకుండా బీఆర్ఎస్ చేసిన కుట్రలకు వ్యతిరేకంగా ఇచ్చిన యాడ్స్ కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి.