బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన మాస్ యాక్షన్ మూవీ యానిమల్ ఇప్పటికే అభిమానుల్లో చాలా హైప్‌ని సృష్టించింది. అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం స్టోరీ(animal movie review) ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా- యానిమల్ నటినటులు- రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, తదితరులు కథ, ఎడిటర్, దర్శకుడు-సందీప్ రెడ్డి వంగా స్క్రీన్ ప్లే-సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా & సురేష్ బండారు నిర్మాతలు- భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురద్ ఖేతాని, కృష్ణ కుమార్ డైలాగ్స్- సౌరభ్ గుప్తా సంగీతం- JAM8, విశాల్, మిశ్రా జానీ రన్ టైమ్- 3గం 21 నిమిషాలు విడుదల తేదీ- డిసెంబర్ 1, 2023
అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన యానిమల్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 1న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సహా కొన్ని పాటలు అభిమానుల్లో ఎంతో ఆసక్తిని పెంచాయి. యాక్షన్ సీన్స్, పంజాబీ సాంగ్స్ ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. అయితే ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
కథ
ఒక కొడుకు తన తండ్రిపై చూపే పిచ్చి ప్రేమనే ఈ యానిమల్ మూవీ స్టోరీ. సందీప్ రెడ్డి వంగా దీనిని 3 గంటల 21 నిమిషాల పాటు వివరంగా విశ్లేషించారు. విజయ్ (రణబీర్)కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే అమితమైన ప్రేమ. బల్బీర్ సింగ్ భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటాడు. ఆ క్రమంలో అతను తన వ్యాపారంలో బిజీగా ఉన్నందున అతని కొడుకు కోసం తగినంత సమయం కేటాయించలేడు. దీంతో చిన్న వయస్సులోనే విజయ్ తన తండ్రితో విభేదాల కారణంగా బోర్డింగ్ స్కూల్‌కు వెళతాడు. చివరికి వివాహం చేసుకుని USలో స్థిరపడతాడు. ఆ క్రమంలోనే బల్బీర్ హత్యాయత్నం గురించి కుమారుడు తెలుసుకుని భారతదేశానికి తిరిగి వస్తాడు. ఆ నేపథ్యంలో అతను తన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకి ఏం జరిగింది? అతని ప్రయాణం మంచి నోట్‌తో ముగుస్తుందా? లేక స్వీయ వినాశనానికి దారితీస్తుందా అనేది తెలియాలంటే మాత్రం పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారు
ఇక రణబీర్ కపూర్ ఈ చిత్రంలో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ని అందించాడు. ప్రతి సీన్ లో కూడా తాను లీనమై యాక్ట్ చేశాడు. ఎమోషన్, ఫైట్స్ సహా అనేక సీన్లలో రణబీర్ బెస్ట్ లెవల్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో రణబీర్ చాలా స్టైలిష్ పాత్రతోపాటు అత్యంత వైలైంట్ గా కనిపించాడు. బాబీ డియోల్ యానిమల్తో అద్భుతమైన పునరాగమనం చేశాడని చెప్పవచ్చు. అతని యాక్టింగ్ రణబీర్‌కి సరిగ్గా మ్యాచ్ అయింది. బల్బీర్ సింగ్‌గా అనిల్ కపూర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ పాత్రను పోషించారు. బాలీవుడ్లో గొప్ప పెర్ఫార్మర్గా ఎందుకు గుర్తించబడ్డారో మరోసారి ఆయన చూపించారు. రణబీర్ లాగానే, అనిల్ కపూర్ కూడా భావోద్వేగాలు సంఘర్షణలను చాలా తేలికగా బ్యాలెన్స్ చేశారు. మరోవైపు గీతాంజలిగా హీరోయిన్ రష్మిక మందన్న తన బెస్ట్ ఇచ్చింది. ఉద్వేగమైన, రొమాంటిక్ సీన్లతోపాటు ఎమోషన్ ను కూడా చక్కగా చూపించింది. ఇక మిగతా నటీనటులు వారి క్యారెక్టర్ల పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
సందీప్ రెడ్డి వంగా మంచి ఇంటెన్స్ డైరెక్టర్ అని చెప్పవచ్చు. అతను యానిమల్తో ఈ అంశాన్ని మరింత నొక్కిచెప్పాడు. మరే ఇతర దర్శకుడు కూడా చూపించని విధంగా రణబీర్ ను చూపించాడు. కానీ ఈ మూవీ స్టోరీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అయితే ఈ మూవీ ఎడిటింగ్ కూడా సందీప్ చేయడం మిస్టెక్ అని చెప్పవచ్చు. సినిమాలో ఎడిటింగ్ కు చాలా స్కోప్ కనిపిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అతని BGM ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సంతాన కృష్ణన్, రవి చంద్రన్ సినిమాటోగ్రఫీ కూడా అత్యున్నతంగా ఉంది.