బీహార్ లోని భాగల్పూర్ ఓ సినిమా హాలులో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చించివేసి, తగులబెట్టారు. భాగల్పూర్ దీప్ప్రభ సినిమా హాలులో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. హిందూ సంస్థలకు చెందిన పలువురు సినిమా హాలులో ఉన్న పోస్టర్లను చించి, దగ్ధం చేశారు. ఫిల్మ్ చలేగా హాల్ జలేగా అంటూ నినదించారు. హిందూత్వంతో రాజీపడేది లేదని, సనాతన సంస్కృతిని వ్యతిరేకించే, కించపరిచే ఏ అంశాన్ని సహించబోమని హెచ్చరించారు.
ఇక్కడ ఏదైనా థియేటర్లలో పఠాన్ సినిమాను ప్రదర్శిస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. కొందరు ఆందోళనకారులు సినిమాను వ్యతిరేకిస్తూ పోస్టర్ను తగలబెట్టినట్లు సినిమా హాలు మేనేజర్ వెల్లడించాడు. దీనిపై తాను స్థానిక పోలీస్ స్టేషన్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశామని, భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు రైట్ వింగ్ కార్యకర్త సత్యరంజన్ బోరా గీతానగర్ పోలీస్ స్టేషన్లో పఠాన్ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినిమాలో హిందూ వ్యతిరేక అంశాలను తొలగించిన నేపథ్యంలో బైకాట్ పఠాన్ ను పక్కన పెట్టింది విశ్వ హిందూ పరిషత్. సినిమాలో ఏవైనా అభ్యంతరకర అంశాలు ఉంటే కనుక కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.