తిరుమల లడ్డూ కౌంటర్లో చోరీ జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజి ద్వారా అనుమానితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ కాంప్లెక్సులో రాజా కిషోర్ కౌంటర్ బాయ్‌గా చేరాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నెలరోజుల క్రితం డ్యూడీలో జాయిన్ అయ్యాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో వర్క్ ముగించుకున్నాడు. లడ్డూలు విక్రయించగా వచ్చిన రెండు లక్షల రూపాయలను తన వద్ద ఉంచుకున్నాడు. గడియ పెట్టడం మరిచిపోయి కౌంటరులో నిద్రపోయానని తెలిపారు.
ఆ మరునాడు ఉదయం లేచి చూడగా నగదు కనిపించలేదు. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా, సీతాపతి అనే పాత నేరస్తుడు కనపించాడు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్ వద్ద అదనంగా సెక్యూరిటీ పెంచారు. అదనంగా 20 మంది గార్డులను నియమించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణపై శిక్షణ కూడా ఇస్తామని అధికారులు చెబుతున్నారు.