Breaking : దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 2.28 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఢిల్లీతో పాటు పలు చుట్టు పక్కన ప్రాంతాలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నేపాల్ కేంద్రంగా.. ఉత్తరాఖండ్ లోని పిథోరాఘర్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదయినట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా ఊగిపోయాయి. ఇంట్లోని వస్తువులు అటూ ఇటూ కదలడం చూసి జనాలు రోడ్ల మీదికి పరుగెత్తారు. కొందరు వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి భూకంపం ఎఫెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించడం వల్ల కొంత సమయం వరకు ఏం జరుగుతుందో జనాలకు అర్థం కాలేదు. ఢిల్లీలో పాటు ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, నోయిడా ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.