Gautham Vasudev Menon: క్రికెట్ నేపథ్యంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా..?
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. ఆయన తాజా చిత్రం ధృవ నక్షత్రం చిత్రాన్ని 24న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తిబన్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే తెలియని సీని అభిమానులంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన క్లాసికల్ లవ్ స్టోరీలు తీయడంలో నేర్పరి. ఆయన డైరెక్షన్ వచ్చిన పలు సినిమాలకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయన ఈ సారి జోనర్ మార్చి కొత్త విధానంలో సినిమా తీయాలని చూస్తున్నారట. అది కూడా ఓ క్రికెట్ నేపథ్యంలో సినిమా తీయాలని భావిస్తున్నారట. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. క్రికెట్ నేపథ్యంలో సినిమా తీస్తానంటూ ప్రకటించాడు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తోన్న ధృవ నక్షత్రం సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. ముంబై ప్రచార యాత్రలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తమిళ ఛానెల్లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ వ్యాఖ్యతగా వ్యవహరించాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు ఆర్జే బాలాజీ, బద్రీనాథ్‌లకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సహ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.
గౌతమ్ మీనన్ క్రికెట్ గురించి మాట్లాడుతూ.. గేమ్ చుట్టూ తిరిగే చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నానని చెప్పాడు. తన సినిమాల్లో క్రికెట్ ఆటను ఏదో ఒక విధంగా రిలేట్ చేస్తానని, వరణం అయ్యర్‌లో సూర్య క్రికెటర్‌గా కనిపించనున్నట్లు తెలిపారు. విన్నైతాండి వరువాయాలో శింబు క్రికెట్ ఆడుతున్నప్పుడు సన్నివేశం వస్తుంది. ధృవ నక్షత్రంలో కూడా క్రికెట్ కు సంబంధించిన డైలాగ్స్ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ విధంగా క్రికెట్‌ను నేపధ్యంగా తీసుకుని సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. పల్లెటూరి నుంచి ఇద్దరు క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటం లాంటి కథ కూడా అనుకున్నట్లు ఆయన తెలిపారు. సచిన్, గంగూలీ ఆధారంగా ఈ కథను రూపొందిస్తానని స్పష్టం చేశారు.