Guvwala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి
అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA), బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజు (MLA Guvvala Balaraju)పై వరుస దాడులు జరుగుతున్నాయి.మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు. అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే,బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు (Guvvala BalaRaju)పై మరోసారి దాడి జరిగింది. వరుస దాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మళ్లి దాడి జరిగింది. నియోజకవర్గంలోని అమ్రాబాద్ (Amrabad) మండలం కుమ్మరోనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు. అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. దాడికి పాల్పడిన తిరుపతయ్య అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ వీరబాబు వెల్లడించారు. నిందితుడు తిరుపతయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్థులపై ఇలాగే దాడులు చేస్తుంటాడని, అతడి మానసికస్థితి సరిగా లేదని వివరించారు.
తిరుపతయ్యకి మతిస్థిమితంలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారని ఆయన వెల్లడించారు.కాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా బాలరాజు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ గుండాలు రాళ్ల దాడి చేయడంతో చేతికి తగిలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు సిగ్గుండాలని, కాంగ్రెస్ నాయకుల (Congress leaders) వైఖరి చూసి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుందని అన్నారు. ఖబర్దార్ వంశీకృష్ణ, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాలారా అని సవాల్ విసిరారు. దాడికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై శనివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. అచ్చంపేట(Atchampeta)లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఆయన గాయపడ్డారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.