కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్ నేడు(నవంబర్ 4న) థియేటర్లో విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) నటించిన తాజా చిత్రం ఘోస్ట్. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి జైలర్ చిత్రంలో క్యామియో రోల్లో సందడి చేసిన ఆయన..ఇప్పుడు ఘోస్ట్‌తో (Ghost) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ చూస్తే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపించింది. నేడు థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
వామన్ శ్రీనివాసన్ (ప్రశాంత్ నారాయణన్) ఓ మాజీ సీబీఐ అధికారి. పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వ అనుమతి తెచ్చకుంటాడు. ఆ క్రమంలో భూమి పూజ చేయడానికి ఆ జైలులోకి అడుగు పెట్టిన వామన్తో పాటు అతని బృందాన్ని ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అదే జైలులో బందీ చేస్తుంది. ఈ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా చరణ్ రాజ్ (జయరామ్)ను రంగంలోకి దించుతుంది. చరణ్ రాజ్ ఇన్విస్టిగేషన్ మొదలు పెడుతాడు. వామన్‌ను అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితమే చనిపోయిన బిగ్ డాడీ (శివ రాజ్‌కుమార్) అని తెలుసుకుంటాడు. ఆ బిగ్ డాడీ ఎవరు? అతను వామన్‌ను ఎందుకు కిడ్నాప్ చేశాడు. ఆ జైలులో ఉన్న వెయ్యి కేజీల బంగారం కథేంటి? పితామహా ఏజెన్సీలోని ఘోస్ట్‌కు.. బిగ్ డాడీకి ఉన్న లింకేంటి? చనిపోయాడు అనుకున్న వాడు ఎలా బతికి వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఘోస్ట్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. మాస్ ఎలివేషన్లుకు కొదవ ఉండదు. స్పై థ్రిల్లర్ కథ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కాకపోతే అక్కడక్కడ కేజీయఫ్, జైలర్ సినిమాలను గుర్తు చేస్తుంది. అంత సెక్యూరిటీ ఉన్న జైలులోనే ఓ మాజీ సీబీఐ అధికారిని హీరో కిడ్నాప్ చేయడం, దాంతో పోలీసు వ్యవస్థను ముప్పుతిప్పలు పెట్టడం అనేది ప్రేక్షకుడు ఆలోచించకపోవడం బెటర్. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే చాలా ముఖ్యం. హీరోకు, పోలీసులకు మధ్య నడిచే మైండ్ గేమ్ ఎంత ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులకు అంత థ్రిల్‌గా ఫీల్ అవుతారు. ఈ విషయంలో కాస్త విజయం సాధించింది ఘోస్ట్. వామన్ శ్రీనివాసన్‌పై బిగ్ డాడీ బృందం జైలులో ఎటాక్ చేసే సన్నివేశంతో చిత్రం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్ అన్నీ వావ్ అనిపిస్తాయి. ఈ కిడ్నాప్ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం చరణ్ రాజ్‌ను రంగంలోకి దించడంతో కథ వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత కథ మొత్తం జైలు గోడల మధ్యే ఇరుక్కుని, అక్కడక్కడే తిరుగుతుంది. జైలులో ఉన్న బిగ్ డాడీ ముఠాను పట్టుకునేందుకు చరణ్ రాజ్ టీమ్ వేసే ఎత్తులు.. వాటిని ఎంతో తెలివిగా బిగ్ డాడీ చిత్తు చేసే తీరు ఆసక్తిరేకెత్తిస్తాయి. ఈ మధ్యలో కథానాయికకు.. ఆమె తండ్రికీ మధ్య వచ్చే సెంటిమెంట్ ట్రాక్ బోర్ కొట్టిస్తుంది. బిగ్ డాడీ గతమేంటి వామన్ శ్రీనివాసన్‌ను ఎందుకు కిడ్నాప్ చేశాడు. జైలులోని వెయ్యి కేజీల బంగారం కథేంటి, దాన్ని బిగ్ డాడీ ఎలా బయటకు తీసుకెళ్లగలిగాడు అనే అంశాల చుట్టూ ద్వితీయార్ధం సాగుతుంది. సీఏం కొడుకును అతని కళ్ల ముందే బిగ్ డాడీ చంపే ఎపిసోడ్ వావ్ అనిపిస్తుంది. అలాగే చరణ్ రాజ్‌కు.. బిగ్ డాడీకీ మధ్య వచ్చే గతానికి సంబంధించిన వార్నింగ్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథలోని కీలక ప్రశ్నలను పార్ట్ 2 కోసం అలానే వదిలేశారు.
ఎవరెలా చేశారు:
శివరాజ్ కుమార్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో అలరిస్తాడు. ఆద్యంతం కళ్లతోనే భావోద్వేగాలు పలికిస్తాడు. ఆయన స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు యాక్షన్ సీక్వెన్స్‌ను స్టైలిష్‌గా తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో టెక్నాలజీ సాయంతో యంగ్ శివన్నను చూపించారు. ఆయా సీన్స్ ఆయన అభిమానులకు ఆనందాన్నిస్తాయి. పోలీస్ అధికారిగా చరణ్ రాజ్ పాత్రలో జయరామ్ నటన ఆకట్టుకుంటుంది. అర్చనా జోయిస్ బాగానే నటించినా.. పాత్ర పెద్దగా ఆకట్టుకోదు. సత్య ప్రకాశ్, ప్రశాంత్ నారాయణన్ తదితరుల తమ పాత్రల్లో మెప్పిస్తారు.
సాంకేతిక అంశాలు:
డైరెక్టర్ ఎంజీ శ్రీనివాస్ శివన్నా ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చాలా స్టైలిష్ మేకింగ్‌తో ఆయన అభిమానులను మెప్పించాడు. కానీ అక్కడక్కడ తడబడ్డాడు. యాక్షన్ సీన్లకు అర్జున్ జన్య అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
+కథ
+బ్యాగ్రౌండ్ స్కోర్
+శివరాజ్ కుమార్ నటన
+యాక్షన్ సీన్స్