Bittiri Satti: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రచార పర్వంలో నేతలు, ప్రముఖులు నిమగ్నం అయ్యారు. ప్రముఖ యాంకర్, బిత్తిరి సత్తి (Bittiri Satti) అలియాస్ రవికుమార్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీ పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష తదితరులు కూడా అధికార పార్టీలో చేరారు.
హీరోలను కలుస్తావు.. నీకెందు రాజకీయం అని తనను అనేవారని బిత్తిరి సత్తి చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ను మించిన మెగా హీరో మరెవరు ఉన్నారు.. అని అనేవాడినని పేర్కొన్నారు. అందుకోసమే కేసీఆర్తో జట్టుకట్టానని తెలిపారు. కేసీఆర్ వెంట ఉండి, గెలిపించుకోవాలని కోరారు. ముదిరాజ్ సభలో ప్రభుత్వానికి గట్టిగా మాట్లాడారని.. కానీ తాను ఎవరికీ అమ్ముడు పోలేదని స్పష్టంచేశారు.
తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కొట్లాడేవాడు కావాలని.. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి.. చావునోట్లో తలపెట్టి తెలంగాణను కేసీఆర్ తీసుకొని వచ్చారని తెలిపారు. తన మీద దాడి చేస్తే సీఎం ఆఫీసు స్పందించిందని గుర్తుచేశారు. నీళ్లు ఇచ్చిన కేసీఆర్ వెంట ఉండాలని.. మరోసారి సీఎం కావాలన్నారు. మంత్రి హరీశ్ రావును బాహుబలితో పోల్చారు. హరీశ్ ఉండగా.. కేసీఆర్కు ఢోకా లేదని చెప్పారు.