martin luther king movie
చిత్రం: మార్టిన్ లూథర్ కింగ్
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్, తదితరులు
సంగీతం: స్మరణ్ సాయి
నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
దర్శకత్వం: పూజ కొల్లూరు
సినిమాటోగ్రఫీ: దీపక్ యరగెరా
విడుదల తేదీ: 27/10/2023
‘హృదయం కాలేయం’, ‘కొబ్బరి మట్ట’, ‘కాలీఫ్లవర్’ వంటి చిత్రాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ హీరో సినిమాలపై పలు విమర్శలు వచ్చినా కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలతో వచ్చిన ‘మార్టిన్ లూథర్ కింగ్'( Martin Luther King ) చిత్రం నేడు(అక్టోబర్ 27న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
స్మైల్ (సంపూర్ణేశ్ బాబు) ఒక అనాథ. పడమరపాడు అనే గ్రామంలో చెప్పులు కుట్టుకుని ఆ ఊర్లో ఓ చెట్టు కింద ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటికైనా అక్కడ ఒక చిన్న చెప్పులు షాపు పెట్టుకోవాలనేది స్మైల్‌కి కోరిక. దీనికోసం చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బును దాచి పెట్టుకుంటాడు. కానీ ఈ డబ్బును ఎవరో దొంగతనం చేస్తారు. అప్పుడు తన స్నేహితుడు సాయంతో పోస్టాఫీసులో డబ్బు దాచాలని అనుకుంటాడు. కానీ అందులో ఖాతా తెరవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డు ఉండాలి. స్మైల్‌కి అలాంటి కార్డులేవి లేవు. అప్పుడు పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత(శరణ్య ప్రదీప్)ను సాయం అడుగుతాడు. వసంత అతనికి ‘మార్టిన్ లూథర్ కింగ్'( Martin Luther King ) అని పేరు పెట్టి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటివి అప్లై చేసి పోస్టాఫీస్‌లో ఖాతా ఓపెన్ చేస్తుంది. ఇక ఆ గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం, దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవులు జరుగుతుంటాయి. దక్షిణ దిక్కుకు లోకి(వెంకటేష్ మహా), ఉత్తరం దిక్కుకు జగ్గు(నరేశ్) సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుంటారు. అయితే ఇద్దరికీ సమాన ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. ఎవరికైతే ఒక్క ఓటు పడుతుందో వాళ్లు సర్పంచ్ కావడంతో పాటు కోట్లు వచ్చే ప్రాజెక్ట్ వస్తుంది. ఇదే సమయంలో మార్టిన్ లూథర్ కింగ్‌కు ఓటు వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు అతన్ని తనవైపు తిప్పుకోవడానికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఓటు హక్కు వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మలుపు తిరగబోతుంది? వారిద్దరి వల్ల తనకు ఎలాంటి సమస్యలు వస్తాయి? తన ఓటుతో గ్రామాన్ని ఎలా మార్చాడు ? అనే విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
ఓటు విలువను తెలియజేస్తూ గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం కూడా అలాంటిదే. గ్రామాల్లో రాజకీయాలు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని చక్కగా చూపించారు. ఓటు విలువ ఏంటి? అని చూపించడంలో దర్శకురాలు మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి సీన్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. వెంటనే జగ్గు, లోకితో పాటు స్మైల్ పాత్రలను పరిచయం చేసి డైరక్ట్‌గా కథలోకి తీసుకెళ్లారు. ఇరు వర్గాల కులాలు వారు గొడవపడే తీరు నవ్వు తెప్పిస్తుంది. ఇంతలో స్మైల్ డబ్బులు ఎవరో దొంగతనం చేయడం, వసంత పరిచయం కావడం, పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం, అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ గ్రామంలో ఎన్నికలు మొదలు కావడంతో అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు లోకి, జగ్గు డబ్బులను ప్రలోభ పెట్టే సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇలాంటి సన్నివేశాల్లో నాయకులు ప్రజల సెంటిమెంట్‌ను ఎలా అడ్డం పెట్టుకున్నారో అని ఆసక్తిగా చూపించారు. మార్టిన్ ఓటు జగ్గుకే పడాలని చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. మార్టిన్ ఓటు ఎంత ముఖ్యమో అని తెలిసినప్పుడు గ్రామ ప్రజలు అతనితో ప్రవర్తించే తీరు అంతా మారిపోతుంది. ద్వితీయార్థంలో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తుంది. కామెడీ సీన్స్ కూడా ద్వితీయార్థంలో అంతగా ఆకట్టుకోలేదు. ఓటు విలువ తెలుసుకుని మార్టిన్ తన ఆలోచన మార్చుకుని, గ్రామం అభివృద్ధి కోసం వినియోగించిన విధానం బాగుంటాయి. కానీ సినిమాని చివరిగా ముగించిన తీరు అంత ఆకట్టుకోదనే చెప్పాలి. ప్రథమార్థం సరదాగా సాగిపోయినా.. ద్వితీయార్థం అంతగా ఆకట్టుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా చిత్రం.
ఇప్పటివరకు సంపూర్ణేశ్ బాబుని మనం కామెడీ సినిమాల్లోనే ఎక్కువగా చూశాం. కానీ ఈ సినిమాలో అతని నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎమోషనల్ రోల్ కూడా సంపూర్ణేశ్ బాబు చేయగలడా? అనేవారికి తన నటనతోనే సమాధానం చెప్పాడు. ఈ సినిమా సంపూర్ణేశ్కి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. సంపూర్ణేశ్ నటన చాలా సహజంగా కనిపిస్తుంది. శరణ్య కూడా తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు వారి క్యారెక్టర్ల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
స్మరణ్ నేపథ్య సంగీతం బాగుందనే చెప్పవచ్చు. కానీ గుర్తుండిపోయే విధంగా ఒక్క పాట కూడా లేదు. ఛాయాగ్రహణం కూడా బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. దర్శకురాలు కథకు తగ్గట్టు చూపించింది. డైలాగ్స్ బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే, సీన్లను ఇంకా బెటర్‌గా రాస్తే బాగుండేది.
+ కథ
+సంపూర్ణేశ్ నటన
+ఓటు విలువ
+గ్రామాల్లో రాజకీయాలు
-ద్వితీయార్థంలో నెమ్మదిగా సాగే కొన్ని సీన్లు
-సాంగ్స్