»Hunting For Ghosts In Kundanbagh Hyderabad 35 People Arrested
Ghost busters: హైదరాబాద్ కుందన్‌బాగ్‌లో దెయ్యాల కోసం వేట..35 మంది అరెస్ట్
కుందన్‌బాగ్ ప్రాంతంలో యువకుల గోల ఎక్కువైంది. ఓ భూత్బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ వారు చేస్తున్న వీడియోలు, రీల్స్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారంతా పోలీసులను ఆశ్రయించడంతో 35 మంది యువకులను అరెస్ట్ చేశారు.
కుందన్‌బాగ్ (Kundanbagh) పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆ పేరే ఇప్పుడు ఎంతో మంది యూట్యూబర్లకు (Youtubers) టార్గెట్ అయ్యింది. హైదరాబాద్ (Hyderabad) బేగంపేట సమీపంలోని కుందన్‌బాగ్ కాలనీలో రాత్రయితే చాలు ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో భయంకరమైన కేకలు వినిపిస్తూ ఉంటాయి. ప్రతి రోజూ అక్కడికి 30 నుంచి 40 మంది యువకులు వస్తూ పోతుంటారు. దీంతో రణగొణ ధ్వనుల మధ్య ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఇంతకీ అక్కడేం జరిగిందంటే కుందన్‌బాగ్ కాలనీలోని ఓ భూత్బంగ్లాలో దెయ్యాలు (Ghosts) ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.
దెయ్యాలు అక్కడ ఉన్నాయంటూ కొందరూ యూట్యూబర్లు తమ ఛానెల్లో వీడియోలో పోస్టు చేస్తూ షేర్స్, లైక్స్ తెప్పించుకుంటున్నారు. దెయ్యాలు ఉన్నాయంటూ కొందరు యువకులు ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఆ బంగ్లా వద్దకు వెళ్లి వీడియోలు, రీల్స్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆ వీడియోలు, రీల్స్ చేయడం ఎక్కువైంది. వారు తీసే వీడియోలు, రీల్స్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు బాగా పాపులర్ అవ్వటంతో ఇంకొందరు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటూ రచ్చ చేస్తున్నారు.
ఆ భూత్ బంగ్లాపై ఫేక్ స్టోరీలు అల్లుతూ గోల గోల చేస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య పదుల సంఖ్యలో యువకులు ఆ బంగ్లా వద్దకు చేరుకుని రచ్చ చేస్తున్నారు. దీని వల్ల ఇరుగుపొరుగు వారంతా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం నుంచి వారు ఆ భూత్ బంగ్లా వద్దే ఉంటున్నా అందులో దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. రాత్రి వేళల్లో యువకుల వల్ల తాము నిద్రకు దూరమవుతున్నట్లు పోలీసులకు తమ సమస్యను చెప్పారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతూ దాదాపు 35 మంది యువకులను అరెస్ట్ చేశారు. వారిపై పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ యువకుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపామని పంజాగుట్ట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మోహన్ కుమార్ వెల్లడించారు. ఆ ఇంటి వైపు ఎవరైనా వెళ్తే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.