»India Will Satisfy The Hunger Of 7 Countries Green Signal For Export Of 10 Lakh Tons Of Rice
Rice Exports: 7 దేశాల ఆకలి తీర్చనున్న భారత్..10 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్
దేశంలోని బియ్యాన్ని 7 దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. దేశంలోని ప్రజల అవసరాల కోసం బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంక్షలను ఎత్తివేసిన భారత్..మొదటగా 7 దేశాలకు తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
పెరుగుతున్న బియ్యం ధరలను (Rice Prices) నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం (Ban Exports) విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా (America) సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. భారత్ (India) నుంచి బియ్యం సరఫరా కాకపోవడంతో పొరుగు దేశాల్లో ఉన్న చాలా మంది బియ్యం కొరతతో అవస్థలు పడ్డారు. ముందుగా సన్న బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత్ ఆ తర్వాత క్రమంగా ఉప్పుడు బియ్యం, బాస్మతి బియ్యం ఎగుమతులను కూడా నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల అవసరాల నిమిత్తం కేంద్రం బియ్యం ఎగుమతులను (Rice Exports) నిలిపివేసింది.
తాజాగా ఆ ఆంక్షలను సవరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 7 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆహార భద్రత దృష్ట్యా అత్యధికంగా అవసరం ఉన్న 7 దేశాలకు సుమారు 10 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. నేపాల్, మలేషియా, ఫిలిప్పిన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవోరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆ 7 దేశాలకు మొత్తం 10.34 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అందులో నేపాల్‌కు 95 వేల టన్నులు, కామెరూన్‌కు 1.90లక్షల టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1.42 లక్షల టన్నులు, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1.42 లక్షల టన్నులు, మలేషియాకు 1.70 లక్షల టన్నులు, ఫిలిప్పిన్స్‌కు 2.95 లక్షల టన్నుల తెల్ల బియ్యాన్ని భారత్ మంజూరు చేసింది. ఇంకా యూఏఈ, సింగపూర్ దేశాలకు సైతం తెల్ల బియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ప్రకటించింది.