విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడంటూ కామెంట్స్ చేసిన వారందరి నోర్లు మూత పడ్డాయి. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. అప్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడేళ్ల పాటు అతని సెంచరీ కోసం ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ సెంచరీ (122 నాటౌట్)తో అదరగొట్టాడు.
ఇక.. రాహుల్ (62)తో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించిన అతను.. ఆ తర్వాత పంత్ (20 నాటౌట్)ను ఒక ఎండ్‌లో నిలబెట్టి మరో ఎండ్‌లో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్ లో కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడాడు. ‘బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. కానీ అవి నా దృక్పథాన్ని ఏ మాత్రం మార్చలేవు. సెంచరీ చేసిన తర్వాత నా ఉంగరాన్ని (పెళ్లి ఉంగరం) ముద్దాడాను. నేను ప్రస్తుతం ఇలా నిలబడటం మీరు చూస్తున్నారు. ఇందుకు కారణమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ఒక వ్యక్తి నా భార్య అనుష్క. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామికకు అంకితం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి తమ పక్కనే నిలబడి, మంచి చెడుల్లో భాగం అయ్యేవారు ఒకరు ఉండాలి. అలా నా జీవితంలో అనుష్క ఉంది. తను క్లిష్ట సమయాల్లో నా వెన్నంటే నిలిచింది. ఆటకు దూరంగా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ.. నన్ను సరైన దృక్కోణంలో ఉంచింది‘ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.