చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అక్రమమని టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా.. న్యాయానికి సంకెళ్లు, బాబుతో నేను అనే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు టీడీపీ, జనసేనతో కలిసి వైసీపీని ఢీకొట్టబోతోంది. ఈ తరుణంలో ఇటీవలె జైలులో చంద్రబాబును పరామర్శించిన జేనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తుకు సమ్మతం తెలిపారు.
పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించినప్పటి నుంచి పొత్తు దిశగా టీడీపీ ముందడుగు వేసి పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జనసేనతో సమన్వయం కోసం నేడు టీడీపీ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని నియమించినట్టు ఆయన తెలిపారు. ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని, ఏపీలో వైసీపీని నామరూపం లేకుండా చేస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు.