పేటీఎం (Paytm)కు ఆర్బీఐ (RBI) షాక్ ఇచ్చింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించకపోవడం వల్ల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై ఏకంగా రూ.5.39 కోట్ల జరిమానాను విధించింది. పేమెంట్స్ బ్యాంకుల లైసెన్సింగ్ కోసం ఆర్బీఐ మార్గదర్శకాలను, బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లను భద్రపరచడం వంటి వాటికి సంబంధించి పేటీఎం నిబంధనలను పాటించకపోవడాన్ని ఆర్బీఐ గుర్తించింది.
ఆర్బీఐ తమ ఆడిటర్లచేత బ్యాంక్ సమగ్ర సిస్టమ్ ఆడిట్ చేసింది. నివేదికలను పరిశీలించిన తర్వాత ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పేటీఎం బ్యాంక్ చెల్లింపు లావాదేవీలను పర్యవేక్షించలేదని, చెల్లింపు సేవలను పొందుతున్న ఎంటిటీల రిస్క్ ప్రొఫైలింగ్ చూడలేదని తేల్చింది. బ్యాలెన్స్ నియంత్రణ పరిమితిని కూడా పేటీఎం ఉల్లంఘించినట్లు సెంట్రల్ బ్యాంకు తెలిపింది.
నిబంధనలు (Rules), సూచనలు పాటించడంలో పేటీఎం (Paytm) విఫలమైందని ఆర్బీఐ (RBI) భారీ జరిమానాను విధించింది. మరోవైపు పేటీఎంతో పాటుగా పూణేకు చెందిన అన్నాసాహెబ్ మాగర్ కోఆపరేటివ్ బ్యాంకుపై కూడా సెంట్రల్ బ్యాంకు (Central Bank) రూ.5 లక్షల జరిమానాను విధిస్తూ ప్రకటన చేసింది.