తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) పేరుతో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 15 మందిని పంపించకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మాదిరిగా ఇతరులను వారికి కేటాయించిన స్థానాలకు పంపించాలని కోరారు. ఈ పని ముందే చేసి ఉంటే తప్పిదాలు జరిగి ఉండేవి కాదన్నారు. మియాపూర్ పరిధి హఫీజ్‌పేటలోని సర్వే నంబర్ 78కి సంబంధించిన భూమిని ఇతరులకు కేటాయించారని రఘునందన్ రావు గుర్తుచేశారు. 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఓ న్యాయం, 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 15 మంది ఉన్నారు. ఇటీవల సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత మిగతా అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.